తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి కేంద్ర ఎన్నికల కమీషన్ గురువారం షెడ్యూల్ ప్రకటించింది. ఇటీవల శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు.
ఎమ్మెల్యేల కోటాలో ఆ రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి జనవరి 11న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆరోజు నుంచి 18వరకు నామినేషన్స్ సమర్పించవచ్చు. జనవరి 19న నామినేషన్స్ పరిశీలన, వాటి ఉపసంహరణకు 22వరకు గడువు ఉంటుంది. జనవరి 29వ తేదీన పోలింగ్ నిర్వహించి, అది ముగియగానే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది, బిఆర్ఎస్ పార్టీకి 39 మంది, బీజేపీకి 8మంది, మజ్లీస్‌కు 7, సీపీఐకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్ధికి మజ్లీస్, బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక కాంగ్రెస్, బిఆర్ఎస్ చెరో ఎమ్మెల్సీ స్థానం గెలుచుకొనే అవకాశం ఉంది.