బిఆర్ఎస్ ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతోంది: సీతక్క

మాజీ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మూడు నెలల్లో హామీలు అమలుచేయకపోతే భరతం పడతామన్నట్లు హెచ్చరించడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు ఆమె గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పార్టీ ఓ ఫ్యూడల్ పార్టీ. అధికారం లేకుండా వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. అందుకే కేటీఆర్‌ మా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం...పేల్చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు.

మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు కాక ముందే హామీలు అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నా పంటరుణాల మాఫీ, నిరుద్యోగభృతి, దళితులకు మూడెకరాలు హామీలను ఎందుకు అమలుచేయలేదు? 

పదేళ్ళపాటు రాష్ట్రాన్ని దోచుకొన్న 420 పార్టీ మీ బిఆర్ఎస్. అందుకే ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టి ఇంటికి పంపారు. మాది మీలాగ గడీ పాలన చేసే దొరల పార్టీ, దోచుకొనే పార్టీ కాదు. అచ్చమైన గల్లీ బిడ్డల పార్టీ. మా ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నేతలు ఆటో రిక్షా డ్రైవర్లను మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని మాకు తెలుసు. 

తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికే మీరందరూ స్వేదం చిందించారు. అందుకే స్వేద పత్రం పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. మీరు రాష్ట్రానికి సృష్టించిన సంపదకంటే మిగిల్చిన అప్పుల భారమే ఎక్కువ. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల పాలు చేసినందుకు మీరు సిగ్గుపడకపోగా గర్వంగా చెప్పుకుంటున్నారు. 

మీ బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తెలంగాణ ప్రజలు ఎందుకు సిగ్గుపడాలి? మీరే తెలంగాణ రాష్ట్రం, ప్రజల పరువు తీశారు. కనుక మీరే సిగ్గుపడాలి,” అంటూ సీతక్క ఘాటుగా కేటీఆర్‌కు బదులిచ్చారు.