నల్గొండ ఎంపీ సీటు కూడా కోమటిరెడ్డి కుటుంబానికేనా?

కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలో ఒకరికే టికెట్‌, పదవి అనే నిబంధన పెట్టుకొన్నప్పటికీ శాసనసభ ఎన్నికలలో కోమటిరెడ్డి సోదరులిద్దరికీ టికెట్లు ఇచ్చింది. ఎన్నికలలో ఇద్దరూ గెలవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి పదవి కూడా లభించింది. ఇప్పుడు కోమటిరెడ్డి కుటుంబం లోక్‌సభ ఎన్నికలలో కూడా తమకు మరో సీటు కావాలని పట్టుబడుతోంది. నల్గొండలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మిని బరిలో దింపాలని భావిస్తున్నారు. 

కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఏడాది బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి, తాను కూడా దెబ్బ తిన్నారు. ఉప ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అనుమతి, ప్రమేయం లేకుండానే నేరుగా కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడుకొని పార్టీలో చేరిపోయి శాసనసభ ఎన్నికలలో మునుగోడు టికెట్‌ సాధించుకొన్నారు. ఇప్పుడు తన భార్యకు కూడా ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నాయకుడు కె.జానారెడ్డి కూడా తన కుమారుడు రఘువీర్ రెడ్డికి భువనగిరి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. శాసనసభ ఎన్నికలలో సూర్యాపేట టికెట్‌ కోసం విఫలయత్నం చేసిన పటేల్ రమేష్ రెడ్డికి లోక్‌సభ ఎన్నికలలో తప్పకుండా టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కనుక నల్గొండ టికెట్‌ తనకే ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.   

బిఆర్ఎస్ పార్టీలో నల్గొండ టికెట్‌ కోసం శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. శాసనసభ ఎన్నికలలోనే ఆయన మునుగోడు నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయాలనుకొన్నారు. కానీ అప్పుడు టికెట్‌ లభించకపోవడంతో ఇప్పుడు భువనగిరి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా భువనగిరి లోక్‌సభ టికెట్‌ ఆశిస్తున్నారు.