ఎట్టకేలకు సింగరేణి ఎండీ శ్రీధర్ బదిలీ

సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్‌ని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయవలసిందిగా సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. శ్రీధర్ స్థానంలో సింగరేణిలోనే ఫైనాన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్‌. బలరామ్‌ని నియమించింది. 

సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీధర్ 2015, జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన హయాంలో సింగరేణి లాభాల బాటలో దూసుకుపోయింది. కనుక సింగరేణి కార్మికులకు ఏటా భారీగా బోనస్ లభిస్తుండేది.

అయితే సింగరేణి సంస్థ లాభాలలో నుంచి నియోజకవర్గం అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను దారి మళ్లించడానికి శ్రీధర్ సహకరిస్తుండటం వలననే కేసీఆర్‌ ఆయనను అదే పదవిలో కొనసాగించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించేవారు.

ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించింది. ఇప్పుడు ఆయనకు ఏ పదవి కట్టబెడుతుందో చూడాలి.