హైదరాబాద్‌ పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు!

మోటారు వాహన చట్టంలో హిట్ అండ్ రన్ కేసులలో శిక్షలను కటినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణనను నిరసిస్తూ యావత్ దేశవ్యాప్తంగా ట్రక్కుల యజమానులు, డ్రైవర్లు మూడు రోజుల బంద్ పాటిస్తున్నారు. ఈ కారణంగా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. 

దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులలో నిలువలు ఖాళీ అయిపోయి ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులు కనబడుతున్నాయి. దీంతో నగరంలో వాహన యజమానులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్న వాహనదారులు సహనం కోల్పోయి  పెట్రోల్ బంకుల సిబ్బందితో గొడవ పడుతుండటంతో వారి మద్య వాదోపవాదాలు, అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ముంబయి, ఢిల్లీ వంటి కొన్ని నగరాలలో పెట్రోల్ బంకుల వద్ద ఘర్షణలు, అల్లర్లు జరుగకుండా పోలీసులను మోహరించవలసి వస్తోంది. 

ఇక దేశవ్యాప్తంగా సరుకు రవాణా ట్రక్కులు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా కూడా స్తంభించిపోయింది. హైదరాబాద్‌లో లక్డీకపూల్-ఖైరతాబాద్, లక్డీకపూల్-మెహదీపట్నం, ఖైరతాబాద్-పంజగుట్ట-అమీర్ పేట మార్గాలలో భారీగా ట్రాఫిల్ స్తంభించింది.