నూతన సంవత్సరం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అతిధి గృహంగా మార్చుతున్నాము. ఆయన నివాస భవనాన్ని మంత్రి నివాస భవనానికి వినియోగించుకుంటాము. మాజీ సిఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని మహాత్మా జ్యోతీబా ఫూలే ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ అండ్ రీసర్చ్ ఆన్లైన్లో సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ కోసం వినియోగించుకొంటాము,” అని చెప్పారు.
“ప్రస్తుతం తెలంగాణతో సహా దేశ విదేశాలలో నర్సులకు చాలా డిమాండ్ ఉంది. కనుక ప్రతీ వంద పడకల ఆస్పత్రులకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తాము. విదేశాలలో పనిచేసేందుకు వీలుగా వారికి శిక్షణ ఇప్పిస్తాము. విదేశీ సంస్థలు, ఆస్పత్రులతో ప్రభుత్వమే సంప్రదింపులు జరిపి వారికి మంచి జీతాలతో ఉద్యోగాలు లభించేలా వ్యవస్థని ఏర్పాటు చేస్తాము,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
“టాటా, మహీంద్రా, సెంచురీ వంటి ప్రముఖ సంస్థల అధ్వర్యంలో ఒక్కో సంస్థ చేత 5 చొప్పున ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. ఇంటర్ కనీస విద్యార్హతతో వాటిలో ప్రవేశాలు కల్పిస్తాము. ఈ యూనివర్శిటీలన్నీ విద్యాశాఖ పర్యవేక్షణలో పనిచేసేలా విధానాలు రూపొందిస్తాం. ఒక్కో యూనివర్సిటీ ఏర్పాటుకి ప్రభుత్వం 200 ఎకరాలు ఇస్తుంది,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.