కొడంగల్‌కు మహర్ధశ... కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ ఏర్పాటు

సిఎం రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం అభివృద్ధిని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ ఏర్పాటు చేసింది. దీనికి వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికి ఈవిదంగా ప్రత్యేక ఆధారిటీలు ఏర్పాటు చేస్తుంటారు. గతంలో కేసీఆర్‌ గజ్వేల్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ ఏర్పాటు చేసి గజ్వేల్‌ని అన్నివిదాలుగా అభివృద్ధి చేశారు. 

ఇప్పుడు కొడంగల్‌ నియోజకవర్గంలో కూడా మౌలిక వసతుల అభివృద్ధి చేయడంతో పాటు యువతకు పరిశ్రమలు, ఐ‌టి రంగాలలో ఉద్యోగాలు, ఉపాధి పొందేందుకు స్కిల్ డెవలప్‌మెంట్‌ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలో రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నందున సొంత నిధులతోనే అభివృద్ధి పనులు చేయించేవారు. కానీ ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అవడంతో కొడంగల్‌కు మహర్దశ మొదలైన్నట్లే.