ఆ ఎమ్మెల్సీ సీటుని బిఆర్ఎస్ మళ్ళీ దక్కించుకోగలదా?

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి ఇటీవల రాజీనామా చేశారు. కనుక దీనిని భర్తీ చేసేందుకు  2024, జూన్ 8లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా ఎన్నికైనందున ఓటర్ల గుర్తింపు, నమోదు ప్రక్రియని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రారంభించింది.  ఫిబ్రవరి 18వరకు కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 21న ముసాయిదా జాబితాని సిద్దం చేసి 24న ప్రచురిస్తారు. దానిపై మార్చి 14 వరకు అభ్యంతరాలు స్వీకరించి 29వ తేదీన తుది జాబితాని ప్రచురిస్తారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించగలిగింది. ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఈ సీటుని గెలుచుకొనే అవకాశం ఇంకా పెరిగింది. మండలిలో కాంగ్రెస్‌కు బలం లేదు కనుక ఈ ఒక్క సీటు గెలుచుకొన్నా దానికి మంచిదే. కనుక గట్టిగా ప్రయత్నించవచ్చు. 

గత పదేళ్ళుగా తెలంగాణలో తిరుగే లేదన్నట్లు ప్రతీ ఎన్నికలలో వరుస విజయాలు సాధిస్తున్న బిఆర్ఎస్ పార్టీ, తొలిసారిగా శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయింది. కనుక ఈ సీటుని కూడా అది కోల్పోలేదు. కనుక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో మళ్ళీ రెండు పార్టీల మద్య హోరాహోరీ యుద్ధం అనివార్యమే.