రాంగోపాల్ వర్మ... ఏమిటా పిచ్చి మాటలు? బర్రెలక్క

తన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకొన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై బర్రెలక్క రాష్ట్ర మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యూహం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రాంగోపాల్ వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. 

రాంగోపాల్ వర్మ ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు కనుక జగన్మోహన్‌ రెడ్డి శత్రువులుగా భావించే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను ఆయన కూడా శత్రువులుగానే భావిస్తూ వారిని కించపరిచే విదంగా ఈ వ్యూహం తీశారు. అందుకే నారా లోకేష్‌ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించగా జనవరి 11వరకు సినిమా విడుదలపై స్టే విధించింది. 

ఇటీవల విజయవాడలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రాంగోపాల్ వర్మ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ని కించపరిచేందుకు బర్రెలక్క ప్రస్తావన తెచ్చి, “తెలంగాణలో ఊరూపేరూ తెలియని ఒక అమ్మాయి బర్రెలక్కగా చాలా ఫేమస్ అయిపోయింది. బర్రెలక్క అంటే బర్రెలు కాస్తుంది. అయితే బర్రెలు కాసే ఆ అమ్మాయి కూడా ఫేమస్ అయిపోయింది కానీ పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఇక్కడ ఏపీలో బర్రెలక్క అయిపోయాడు,” అంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. 

రాంగోపాల్ వర్మకి పవన్‌ కళ్యాణ్‌తో శతృత్వం లేదా విభేదాలు ఉంటే ఆయనతో చూసుకోవాలి కానీ మద్యలో తన పేరుని ప్రస్తావిస్తూ చులకనగా మాట్లాడటం దేనికి?తన గురించి అనుచితంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బర్రెలక్క శుక్రవారం తెలంగాణ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.