2.jpg)
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా ఓటమి చవి చూసిన బిఆర్ఎస్ పార్టీ ఆ షాక్ నుంచి తేరుకొని త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశం మేరకు జనవరి 3 నుంచి నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాకు తెలియజేశారు.
ముందుగా జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ళ, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్‌సభ ఎన్నికలు నియోజకవర్గాలలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.
మళ్ళీ సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 16న నల్గొండ, 17న నాగర్‌కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్‌గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.
ఈ సమావేశాలలో పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్వహిస్తారని కేటీఆర్ తెలిపారు.