మేడిగడ్డ క్రుంగుబాటుపై కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదు?

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రుల బృందం శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజికి వచ్చి దానిలో 7వ బ్లాకులో క్రుంగిన ప్రదేశాన్ని పరిశీలించారు. 

అనంతరం రాష్ట్ర సాగునీటి శాఖ, ప్రాజెక్ట్ అధికారులు వారికి అక్కడే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజిలో కొంత భాగం ఎందుకు క్రుంగిపోయింది? దానిని ఎలా సరిచేయాలి?సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చులని నిర్మాణ సంస్థ భరించాలా లేక ప్రభుత్వమే భరించాలా? దీని గురించి నిర్మాణ ఒప్పందంలో ఏముంది? వంటి వివరాలను మంత్రులు వారిని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు వారందరూ హెలికాఫ్టర్‌లో ప్రాజెక్టును పరిశీలించారు. 

ఈ సందర్భంగా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మేడిగడ్డ బ్యారేజి కట్టిన మూడేళ్ళకే ఇంతగా క్రుంగటం చాలా బాధాకరం. 

ప్రాజెక్టుపై బాంబులు వేసినా చెక్కుచెదరనంత ధృఢంగా నిర్మించామని, దానిని స్వయంగా దగ్గరుండి డిజైన్ చేయించానని, ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకొని కూర్చొని నిర్మింపజేశానని మాజీ సిఎం కేసీఆర్‌ గొప్పలు చెప్పుకొన్నారు. మరి మేడిగడ్డ బ్యారేజి క్రుంగినప్పటి (అక్టోబర్ 21) నుంచి డిసెంబర్‌ 3న ప్రభుత్వం మారే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా? కానీ దాని గురించి కేసీఆర్‌ ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడలేదు?

దీని వలన ఎస్‌ఆర్‌సీపీ ఆయకట్టు మొత్తం దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. దీని దిగువన ఉండే అన్నారం బ్యారేజి కూడా దెబ్బతింది. దాని తర్వాత సుందిళ్ళ బ్యారేజీ పరిస్థితి ఏవిదంగా ఇంకా పరిశీలించవలసి ఉంది. 

కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ప్రాణహిత ప్రాజెక్ట్ బాగుంటుందని ఆనాడు మేము కేసీఆర్‌కు చెప్పాము. దాంతో మహారాష్ట్రలో ముంపు తక్కువగా ఉండేది. ప్రాజెక్టు ఖర్చు, నిర్వహణ వ్యయం కూడా ఇంతగా ఉండేది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశించాము. ఆ నివేదిక వస్తే తదనుగుణంగా చర్యలు తీసుకొంటాము,” అని చెప్పారు.