
బుధవారం జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో సీపీఐ అనుబంధ ఏఐటియూసీ విజయం సాధించింది. సింగరేణి 11 ఏరియాలలో కలిపి మొత్తం 39,773 మంది కార్మికులు ఉండగా వారిలో 37,447 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు.
సింగరేణిలోని ఏరియాలలో అత్యధికంగా ఓట్లు సాధించిన కార్మిక సంఘాన్ని ఆయా ఏరియాల ప్రాతినిధ్య సంఘంగా పరిగణిస్తారు. కానీ అన్ని ఏరియాలలో కలిపి అత్యధికంగా ఓట్లు సాధించిన సంఘాన్ని గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు.
నిన్న అర్దరాత్రి 12.30 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరుగుతూనే ఉంది. దాని ప్రకారం సింగరేణిలోని 5 ఏరియాలలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టియూసీ, 6 ఏరియాలలో ఏఐటియూసీ అత్యధిక ఓట్లు సాధించి ప్రాతినిధ్య సంఘాలుగా ఎన్నికయ్యాయి. కనుక సుమారు 2,000 ఓట్ల ఆధిక్యంతో ఏఐటియూసీ విజయం సాధించి సింగరేణి కార్మికులు గుర్తింపు కార్మిక సంఘంగా నిలిచింది.
ఏఐటియూసీ: బెల్లంపల్లి రీజియన్: బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాలలో విజయం సాధించింది.
ఐఎన్‌టియూసీ: రామగుండం రీజియన్‌లోని రామగుండం-3, కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం, కార్పొరేట్ కార్యాలయం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాలో విజయం సాధించింది.
2012, 2017లో జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించిన బిఆర్ఎస్ పార్టీ అనుబంద సంఘం టీజీబీకెఎస్‌కు ఈ ఎన్నికలలో పెద్దగా ఓట్లు పడకపోవడంతో ఓడిపోయింది.