తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ప్రజా పాలన పోస్టర్స్ ఆవిష్కరిస్తూ మాజీ సిఎం కేసీఆర్ గురించి ఓ సంచలన విషయం బయటపెట్టారు. “కేసీఆర్ మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకంతో ఒక్కోటి సుమారు రూ.3 కోట్లు ఖరీది చేసే 22 లాండ్ క్రూజర్ వాహనాలను కొని విజయవాడలో దాచిపెట్టారు. తాను ముఖ్యమంత్రి కాగానే వాటిని తెప్పించుకొని వాడుకొందామనుకొన్నారు. కానీ దురదృష్టం వలన కేసీఆర్ ఓడిపోయి ఇంట్లో కూర్చోన్నారు. తెలంగాణకు ఆస్తులు కూడబెట్టామని చెప్పుకుంటున్నారు ఇలాగేనేమో?ఒక్కోటి మూడు కోట్లు ఖరీదు అంటే 22 వాహనాల ఖరీదు 66 కోట్లు పైమాటే కదా?
కేసీఆర్ అన్ని వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారనే విషయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేవరకు నాకు కూడా తెలీదు. నేను ఖర్చులు తగ్గించుకోవడానికి పాతవాటికి మరమత్తులు చేయాలని అధికారులకు చెపుతున్నప్పుడు వారే ఈ విషయం నాకు చెప్పారు. విజయవాడలో 22 కొత్తవి ఉండగా పాతవాటికి మరమత్తులు ఎందుకన్నారు. కేసీఆర్ ఆయన బంధుమిత్రులు తిరగడానికి ప్రజాధనం ఖర్చుచేసి కొన్న వాహనాలను త్వరలోనే హైదరాబాద్కు రప్పించి రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు కూడా చూపిస్తాము,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.