శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పధకాలను అమలుచేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి జనవరి 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం పేరిట గ్రామసభలని నిర్వహించబోతోంది. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి ఈరోజు సచివాలయంలో ప్రజావాణి పోస్టర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “బిఆర్ఎస్ హయాంలో ప్రజలు సంక్షేమ పధకాల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగేవారు. కానీ మేము ఈ ‘ప్రజా పాలన’ కార్యక్రమంతో ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళుతున్నాము. మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పధకాలకు కట్టుబడి ఉంది. అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి వీటిని తప్పకుండా అందించడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము.
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజావాణి పేరిట గ్రామసభలు నిర్వహిస్తున్నాము. వాటిలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు చెప్పుకొంటే వీలైనంతవరకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు వారు ప్రయత్నిస్తారు.
ఈ కార్యక్రమంలోనే అర్హులైన లబ్ధిదారుల నుంచి ఆరు గ్యారెంటీ పధకాలకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయిస్తున్నాము. ఎంపీడీవో, ఎంఆర్‌వోల పర్యవేక్షణలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది.
జనవరి 6వ తేదీ వరకే ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ఆ తర్వాత కూడా దీనిని నిరంతరం కొనసాగిస్తాము. ప్రజలు స్థానిక ఎంపీడీవో, ఎంఆర్‌వో కార్యాలయాలలో ఆరు గ్యారెంటీ పధకాలకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కనుక ప్రజలెవరూ దళారులను లేదా రాజకీయ నాయకులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇస్తాము,” అని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.