ఆరు గ్యారెంటీ స్కీములకు గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ

శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములలో రెండింటినీ అధికారం చేపట్టిన రెండు రోజులకే అంటే డిసెంబర్‌ 9 నుంచే అమలుచేయడం ప్రారంభించింది. ఇప్పుడు మిగిలిన నాలుగు గ్యారెంటీ స్కీములను కూడా కాంగ్రెస్‌ స్వయంగా పెట్టుకొన్న మూడు నెలల గడువులోగా అమలుచేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 

ఈ నెల 28 నుంచి జనవరి 6వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పధకాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు ప్రకటించింది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ పట్టణం, మండల కేంద్రాలలో పదిరోజుల పాటు గ్రామసభలు నిర్వహించి, అర్హులైనవారిని అక్కడికక్కడే గుర్తించి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అధికారుల అధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. 

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పధకాలు: 

1. మహాలక్ష్మి పధకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు రూ.2,500 పింఛన్. రూ.500లకే గ్యాస్ సిలిండర్. 

2. రైతు భరోసా పధకం కింద రైతులకు, (కౌలు రైతులకు కూడా) ఎకరానికి ఏడాదికి రూ.15,000. వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరి పంటకు రూ.500 బోనస్. 

3. గృహజ్యోతి పధకం క్రింద ప్రతీ కుటుంబానికి నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా. 

4. ఇందిరమ్మ ఇళ్ళు పధకంలో ఇల్లు లేనివారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు ఆర్ధిక సాయం. 

5. యువ వికాసం పధకంలో విద్యార్దులకు రూ.5 లక్షలు విద్యా భరోసా కార్డు. 

6. చేయూత పధకంలో వృద్ధులు, వింతంతు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4,000 పింఛన్ మరియు రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు.