తెలంగాణకు గవర్నర్‌గా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న తమిళిసై సౌందరరాజన్ తన రెండు పదవులకి త్వరలో రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో ఆమె తన స్వరాష్ట్రమైన తమిళనాడు నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ అనుమతి తీసుకొని గవర్నర్ పదవులకు రాజీనామా చేసేందుకే ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్ళిన్నట్లు తెలుస్తోంది.
తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసేవారు. ఆమె గతంలో రెండు మూడుసార్లు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ మరోసారి అదృష్టం పరిశీలించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఆమె రాజీనామా చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమె స్థానంలో కొత్త గవర్నర్‌ని నియమిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో బిఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినందున గవర్నర్‌గా ఓ మాజీ ఐపిఎస్ ఆఫీసర్‌ని నియమించవచ్చని సమాచారం.