ప్రధాని మోడీతో రేవంత్‌ రెడ్డి తొలిసారిగా రేపు భేటీ

రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యేందుకు సిఎం రేవంత్‌ రెడ్డికి ప్రధాని కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసింది.

తొలిసారి మర్యాదపూర్వకంగా ప్రధాని నరేంద్రమోడీని కలుస్తున్నప్పటికీ, త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కూడా రేవంత్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించే అవకాశం ఉంది. 

సిఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్‌ అధిష్టానంతో కూడా భేటీ అయ్యి లోక్‌సభ ఎన్నికలు, అభ్యర్ధుల గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలనే టీపీసీసీ అభ్యర్ధనను ఆమెకు తెలియజేసి ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు.

ఒకవేళ సోనియా గాంధీ అంగీకరించకపోతే, రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా గాంధీలలో ఎవరో ఒకరిని తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయవలసిందిగా సిఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరనున్నారు.