తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమిని చూశాము. రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఏవిదంగా ఉంటుందో చూస్తున్నాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నెలరోజులు కూడా కాకముందే బిఆర్ఎస్ పార్టీ అప్పుడే యుద్ధం ప్రారంభించేసింది.
కనుక మరో మూడు నెలల హనీమూన్ పీరియడ్ ముగిసేలోగా వాటి మద్య యుద్ధం పతాకస్థాయికి చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. ఆలోగానే మార్చి-ఏప్రిల్ నెల్లల్లోనే లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. కనుక రేవంత్ పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇది తొలి పరీక్షగానే భావించవచ్చు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతునందున రేవంత్ ప్రభుత్వం గురించి రాష్ట్రంలో ప్రజలు ఏమనుకొంటున్నారు? లోక్‌సభ ఎన్నికలలో ప్రజలు ఎటువైపు మొగ్గుచూపబోతున్నారో తెలుసుకొనేందుకు అప్పుడే రాష్ట్రంలో వివిద మీడియా, సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహిస్తున్నాయి.
ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ తాజా సర్వే ప్రకారం, రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ 9-11 సీట్లు గెలుచుకొంటుందని, బిఆర్ఎస్ 3-5 సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పింది. బీజేపీకి గతంలో కంటే తక్కువగా 1-3 సీట్లు లభించవచ్చని చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు పడవచ్చని చెప్పింది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతోనే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తోంది కనుక ఆలోగా వాటిని అమలుచేసి, అత్యధిక స్థానాలు గెలుచుకొనే అవకాశం కలుగుతుందని ఏబీపీ చెప్పింది.