ఓటమి మాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే: కేటీఆర్‌

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆదివారం తెలంగాణ భవన్‌లో ‘స్వేద పత్రం’ పేరుతో తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

ఈ తొమ్మిదిన్నరేళ్ళలో  తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశానికే   ఆదర్శంగా నిలిపామని, కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ రాష్ట్ర  ప్రతిష్టని దెబ్బ తీసేవిదంగా వ్యవహరిస్తుండటం భాధాకరమని అన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదలచేసిన శ్వేతపత్రాలలో ఆస్తులను, అభివృద్ధిని చూపకుండా కేవలం అప్పులను మాత్రమే చూపిస్తూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిందని కేటీఆర్‌ వాదించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందో మాపై రాజకీయకక్ష సాధింపులకు పాల్పడుతుందో దానిష్టం. మేము దేనికైనా సిద్దమే. 

బిఆర్ఎస్ పార్టీ షాడో టీమ్స్ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వివిద శాఖల పనితీరుని పరిశీలిస్తూ వాటి లోటుపాట్లను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుందని కేటీఆర్‌ చెప్పారు. 

"ప్రతీ గెలుపు, ఓటమిలో పాఠాలు, గుణపాఠాలు ఉంటాయి. ఈ ఓటమి మాకు స్పీడ్ బ్రేకర్ వంటిది మాత్రమే. కనుక ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకే సాగుతాము. తెలంగాణ రాష్ట్రం దేశానికి దీపస్తంభం వంటిది. దానిని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్పేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితులలో దానిని ఆరిపోనీయకుండా కాపాడుకొంటాము. ప్రజల తరపున కాంగ్రెస్‌ ప్రభుత్వంతో మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము," అని కేటీఆర్‌ చెప్పారు.