బిఆర్ఎస్ స్వేదపత్రం... రేపటికి వాయిదా!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర వాస్తవ ఆర్ధిక పరిస్థితిని ప్రజలకు తెలియజేసేందుకు శాసనసభలో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ బిఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసీఆర్‌ ఆర్ధిక క్రమశిక్షణ పాటించకుండా ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించేశారని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 

ఇప్పటికే ఎన్నికలలో ఓడిపోయి రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్న బిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ శ్వేతపత్రాలు, వాటి ఆధారం అది చేస్తున్న తీవ్ర ఆరోపణలతో ప్రజలు కూడా అనుమానించే పరిస్థితి ఏర్పడింది. 

పైగా కేసీఆర్‌ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులలో అవకతవకలు, ఛత్తీస్‌ఘడ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు, ధరణి పోర్టల్‌లో  అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశిస్తుండటంతో కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్‌ నేతలందరూ కేసులలో చిక్కుకొనే సూచనలు కనిపిస్తోంది. 

కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ముందే నిలువరించడం తప్పనిసరి అయ్యింది. అందుకే కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి తెలంగాణ భవన్‌లో నేడు స్వేదపత్రం పేరుతో పవర్ పాయిట్ ప్రజంటేషన్ ఇస్తామని బిఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిండేట్ కేటీఆర్‌ శుక్రవారం ట్వీట్ చేశారు. కానీ అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం రేపటికి వాయిదా వేసిన్నట్లు బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.