ప్రజాభవన్‌ నుంచి గ్రామాల వరకు ప్రజాపాలన!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే ప్రజాభవన్‌లో ప్రజావాణి పేరుతో సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు నేరుగా సామాన్య ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో వివిద జిల్లాల నుంచి హైదరాబాద్‌ రావడం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ముందుగా ఈనెల 28 నుంచి  జనవరి 6వరకు పదిరోజుల పాటు అన్ని జిల్లా, మండల కేంద్రాలలో కలక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల వద్దకే అధికారులు తరలివస్తున్నందున దీనికి ‘ప్రజాపాలన’ అనే పేరు ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో వీలుని బట్టి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. 

ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల సమస్యలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా జిల్లాలోని సంబందిత శాఖల అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం గురించి సిఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.