జేడీ లక్ష్మినారాయణ ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటు!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. శుక్రవారం విజయవాడలో ‘జై భారత్‌ నేషనల్ పార్టీ’ ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది నేను పెట్టిన పార్టీ కాదు. ప్రజల ఆకాంక్షలలో నుంచి పుట్టిన పార్టీ. ఏపీకి ప్రత్యేకహోదా సాధించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. ఈ విషయంలో అన్ని పార్టీలు పరస్పరం నిందించుకొంటూ తమ బాధ్యత నుంచి తప్పించుకొంటున్నాయి. కనుక ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం పోరాడేందుకు ఓ రాజకీయ వేదిక అవసరమని భావించి ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నాము,” అని లక్ష్మినారాయణ చెప్పారు. 

లక్ష్మినారాయణ విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చెప్పారు. ఎన్నికలలో ఆయన ఒక్కరే పోటీ చేస్తారా లేక పార్టీ తరపు అభ్యర్ధులను కూడా నిలబెడతారా?అనేది ఇంకా తెలియవలసి ఉంది. కానీ ఎన్నికలకు 3-4 నెలల ముందు ఇప్పుడు పార్టీ స్థాపించడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదని ఎన్నికల చరిత్ర చూస్తే అర్దమవుతుంది. తెలంగాణ ఎన్నికలలో బీఎస్పీ, జనసేనల పరిస్థితి ఏమయిందో అందరూ చూశారు. మరి లక్ష్మినారాయణ ఏ ధైర్యంతో, ఏ ఉద్దేశ్యం, ఏ నమ్మకంతో పార్టీని ఏర్పాటు చేశారో?