సింగరేణి ఎన్నికల వాయిదా కుదరదు: హైకోర్టు

సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27వ తేదీన జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలను మార్చి వరకు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ తరపున దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత పిటిషన్‌ తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటికే ఓసారి శాసనసభ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేశామని మరోసారి వాయిదా వేయాల్సిన అవసరం లేదని, కనుక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో సింగరేణిలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల అనుబంద కార్మిక సంఘాలు  వెంటనే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశాయి. 

శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత, బిఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా ఓడిపోయి ప్రతిపక్ష బెంచీలకు మారిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నా ఎన్నికలివి. కనుక రెండు పార్టీలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకమే. కనుక మళ్ళీ సింగరేణి వేదికగా మరోసారి రెండు పార్టీల మద్య పోరాటం తప్పదు.