హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము ... 5 రోజులు బస

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, సిఎస్, డిజిపి, త్రివిద ధళాధికారులు, పలువురు ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు.       

ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 5 రోజులు బస చేయడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారమే రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్‌లో బస చేసేందుకు వచ్చారు. ఈ 5 రోజులలో ఆమె పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. 

మంగళవారం హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ధి వేడుకలలో పాల్గొంటారు. బుధవారం పోచంపల్లికి వెళ్ళి అక్కడ చేనేత, పవర్ లూమ్ కార్మికులతో మాట్లాడుతారు. వారు తయారుచేసే వివిద రకాల చీరలు, ఉత్పత్తులను పరిశీలిస్తారు. బుధవారం సాయంత్రం సికింద్రాబాద్‌ ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో పాల్గొంటారు. 

గురువారం రాష్ట్రపతి నిలయంలో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం అధికార, ప్రతిపక్ష నాయకులు, విద్యావేత్తలు, ప్రముఖులకు ఎట్ హోమ్ విందు ఇస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం మళ్ళీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.