కేటీఆర్‌ బెదిరింపులు సరికాదు: కూనంనేని

ఈరోజు శాసనసభ సమావేశాల చివరి రోజున కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ సభ్యుల మద్య చాలా వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి. మద్యలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు కలుగజేసుకొని, “బీజేపీ, బిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలకు కలిపి 54 మంది సభ్యులు ఉన్నారంటూ కేటీఆర్‌ మాటలకు అర్దం ఏమిటి?కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామన్నట్లు బెదిరించడంగానే మేము భావిస్తున్నాము. ఈ ధోరణి  సరికాదు. శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చించడానికే తప్ప రాజకీయ వాదోపవాదాలు చేసుకోవడానికి కాదని గ్రహిస్తే మంచిది. 

శాసనసభ సమావేశాలను ఎక్కువ రోజులు నడిపించడం ప్రభుత్వం బాధ్యత. దానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం ప్రతిపక్షాల బాధ్యత. గత ప్రభుత్వం హయాంలో మొక్కుబడిగా శాసనసభ సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఆ తప్పు చేయకుండా వీలైనన్ని ఎక్కువ రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత శాసనసభ సమావేశాలు ఈనెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ ప్రకటించారు. 20వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు మళ్ళీ మొదలవుతాయి.