కేటీఆర్‌ అప్పుడే దడదడలాడించేశారు... బాబోయ్!

ఇవాళ్ళ తెలంగాణ శాసనసభ సమావేశాలలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ జరిగింది. ఆమె ప్రసంగం కేసీఆర్‌ పాలనపై విమర్శలతో, అద్భుతంగా మొదలైన కాంగ్రెస్‌ పాలన, ఆరు గ్యారెంటీలతో సాగింది.  

కనుక ఈరోజు చర్చలో మాజీ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ పాలనలో గంజి కేంద్రాలు, వలసలు, కరెంట్ కోతలు, సాగు, త్రాగునీటి కోసం ప్రజలు అలమటించడాన్ని గుర్తుచేసి ఆ సమస్యలు కష్టాల నుంచి తమ ప్రభుత్వం ప్రజలకు విముక్తి కల్పించిందని గుర్తుచేశారు.

గతంలో రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధ్వాన పాలనపై శాసనసభలో చేసిన విమర్శలను కూడా చదివి వినిపించారు. తండ్రి చనిపోయినప్పుడు స్నానం చేయడానికి నీళ్ళు కూడా లేని దుస్థితి గురించి ఆనాడు రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలను కేటీఆర్‌ నేడు గుర్తుచేసి మీ కాంగ్రెస్‌ పాలన ఎంత అధ్వానంగా సాగిందో తెలుసుకోండి అంటూ కేటీఆర్ గట్టిగా వాతలు పెట్టారు.

ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పుకొంటున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకి ఎమర్జన్సీ విధింపు, ప్రజాప్రభుత్వాలని కూల్చివేయడం గుర్తుచేసి, మళ్ళీ అటువంటి పాలనే అందిస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని కేటీఆర్‌ అన్నారు.

మందబలంతో తనను మాట్లాడనీయకుండా అడ్డుకొన్నంత మాత్రన్న చరిత్ర మారిపోదు. తెలంగాణ కోసం కేసీఆర్‌ చేసిన పోరాటాలు, త్యాగాలు, గత పదేళ్ళలో తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని ఎవరూ మార్చేయలేరు… దాచేయలేరని కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. 

కేటీఆర్‌ మాట్లాడుతుంటే సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కాదనలేకపోయారు. ఎందుకంటే కేటీఆర్‌ చెప్పినవన్నీ వాస్తవాలే కనుక!