కేసీఆర్‌ని నేను విమర్శించలేదు: తక్కెళ్ళపల్లి

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మండలి సమావేశాలకు హాజరైనప్పుడు బయట మీడియాతో మాట్లాడుతూ, “వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. ఎందుకంటే కుక్కలు కూడా వారి వెంట పడవు కనుక.

నేటికీ ఉమ్మడి వరంగల్ ప్రజలలో ఉద్యమస్పూర్తి కనిపిస్తుంటుంది. అటువంటి చోట ఉద్యమద్రోహి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మంత్రి పదవి ఇవ్వడం ప్రజల మనసులను గాయపరిచింది. ఆయన ప్రజల మద్యకు వస్తే ఏవో కబుర్లు చెప్పి నవ్వించి మెప్పించాలనుకొన్నారే తప్ప ఏనాడూ ప్రజల కోసం ఏమీ చేయలేదు. అలాగే జిల్లా ప్రజలను ఏనాడూ పట్టించుకోని సత్యవతి రాథోడ్ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. 

ఈ విషయం కేసీఆర్‌కి చెపుదామంటే ఆయన చుట్టూ ఎర్రబెల్లి వంటి తొక్కుడు బ్యాచ్ ఉంది. బయట నుంచి వచ్చిన అటువంటి నేతలు మావంటివారిని అణచివేస్తూ కేసీఆర్‌కు దూరంగా ఉంచారు. కనుక కేసీఆర్‌ చుట్టూ ఉన్న ఈ తొక్కుడు బ్యాచ్ వలననే  క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏవిదంగా ఉందో తెలుసుకోలేకపోయారు. అందువల్లే బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీల నుంచి కోరి తెచ్చుకొన్న నేతలు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాడుకొంటూ ఉండిపోయారు. ఈ కారణంగా అక్కడా బిఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకొని ఈ తొక్కుడు బ్యాచ్‌ని పూర్తిగా పక్కన పెడితే కానీ మళ్ళీ కోలుకోలేదు. కేసీఆర్‌ని కలిసేందుకు నాకు అవకాశం లభిస్తే అన్నీ వివరిస్తా,” అని అన్నారు.  

ఆయన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు మీడియాలో ప్రధానంగా రావడంతో తక్కెళ్ళపల్లి రవీందర్ రావు వెంటనే యూ టర్న్ తీసుకొని ఖండించారు. నా మాటలని మీడియా వక్రీకరించింది. నేను కేసీఆర్‌ నిర్ణయాలను ఎన్నడూ తప్పు పట్టలేదు. ఆయన నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. ఒకవేళ నేను దేని గురించైనా మాట్లాడాలనుకొంటే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెపుతాను. నేను చిట్ చాట్‌లో కేసీఆర్‌ని విమర్శించిన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను,” అని అన్నారు.