సిఎం రేవంత్ రెడ్డి చాలా నిరాడంబరంగా ప్రజలతో కలిసిపోతూ చాలా మంచి పేరు సంపాదించుకొంటుంటే, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కంటే ఎక్కువ హడావుడి చేస్తుండటం విశేషం.
కొండల్ రెడ్డికి పార్టీలో కానీ ప్రభుత్వంలో గానీ ఎటువంటి పదవీ లేదు. అయినప్పటికీ నిన్న కామారెడ్డిలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ కృతజ్ఞత సభకు ఓ 10-15 కార్ల కాన్వాయ్‌తో తరలివచ్చారు. సభకు వచ్చినవారు వాటిని చూసి సిఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని అనుకొన్నారు. కానీ కారులో నుంచి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి దిగడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
దారిలో తన అనుచరుడు కనిపించడంతో కాన్వాయ్ ఆపించి కారులో నుంచే కొండల్ రెడ్డి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించినప్పుడు దారిన పోయేవారు కూడా ఆయన హడావుడి చూసి ఆశ్చర్యపోయారు. వారిలో ఒకరు తమ మొబైల్ ఫోన్లో కొండల్ రెడ్డి హడావుడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.
తెలంగాణ బీజేపీ కూడా ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ, “ఇదివరకు కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారనే ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని గద్దె దించారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చిన్నట్లుంది,” అని ట్వీట్ చేసింది.