తెలంగాణ ప్రభుత్వం మాజీ సిఎం కేసీఆర్ భద్రతని కుదించింది. ఇప్పటి వరకు ఆయనకు ‘జెడ్’ కేటగిరీ భద్రత ఉండేది. కానీ ఇక నుంచి 4+4 గన్‌మ్యాన్, ఒక ఎస్కార్ట్ వాహనంతో ‘వై’ కేటగిరీ భద్రత ఉంటుంది. ఆయన ఇంటి ముందు 24 గంటలు పోలీస్ సెంట్రీ కొనసాగించనున్నారు.
కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేల భద్రతని కూడా తెలంగాణ ప్రభుత్వం కుదించింది. ఇకపై వారికి 2+2 గన్‌మ్యాన్‌తో భద్రత కల్పించింది. మాజీలైన ఎమ్మెల్యేలకు గన్మ్యాన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకొంది.
అయితే మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరికీ ప్రాణాపాయం ఉంది కనుక వారి భద్రతను యధాతధంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యంగా... మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతలైన ములుగు, భద్రాచలం, కొత్తగూడెం తదితర నియోజకవర్గాలకు ప్రాత్నిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది.