తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా ప్రజాభవన్‌లోకి మారారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ ముఖ్య నేతలు, అనుచరుల సమక్షంలో గృహాప్రవేశం పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ ముచ్చటపడి కట్టించుకొని చివరి వరకు దానిలోనే కుటుంబ సమేతంగా ఉన్నారు. పాత సచివాలయానికి వాస్తు దోషాలు ఉన్నాయనే కారణంతో మూడేళ్ళపాటు ప్రజాభవన్ నుంచే రాష్ట్రాన్ని పాలించారు.
కేసీఆర్ వాస్తు పిచ్చితో వందల కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ప్రగతి భవన్ నిర్మించుకొన్నారని విమర్శలు వచ్చినప్పుడు దానిని తన కోసం నిర్మించుకోలేదని, భవిష్యత్‌లో రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే వారే దానిలో నివసిస్తారని కేసీఆర్ సర్ధిచెప్పుకొన్నారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి దానిలో నివశించడానికి ఇష్టపడలేదు.
కేసీఆర్ ఖాళీ చేయగానే దాని పేరుని ప్రజాభవన్‌గా మార్చి దానిలోనే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దానిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించేశారు కూడా. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ సమీపంలోగల డా.మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోతున్నారు.