కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలపై చర్చించి ఆమోదిస్తామని చెప్పుకొన్నారని కానీ రెండు హామీలనే అమలుచేసి అప్పుడే మాట తప్పారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇప్పుడు లెక్కలు కట్టుకొని వాటిని అమలుచేస్తారా లేక హామీలు అమలు చేసి లెక్కలు కట్టుకొంటారా?ఆట ఇప్పుడే మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుంది అసలైన ఆట,” అని కేసీఆర్ అన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందిస్తూ, “మేము అధికారంలోకి వచ్చి ఇంకా 10 రోజులు కూడా కాలేదు. దానిలో రెండు మూడు రోజులు ప్రమాణస్వీకారాలు ఇతర కార్యక్రమాలకే సరిపోయింది. కనుక కేటీఆర్‌కి అప్పుడే ఇంత తొందర పనికిరాదు. ఆయన పదవి, అధికారం పోయిందనే బాధతోనే ఈవిదంగా మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజులలోనే రెండు హామీలు అమలుచేశాము. మిగిలిన వాటిని కూడా 100 రోజులలో తప్పకుండా అమలుచేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాట తప్పము.
మేము ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చామని కేటీఆర్ అన్నారు. మరి మేము ఇచ్చిన ప్రతీ హామీలకి మరికొంత సొమ్ము జోడించి మీరు కూడా వాటిని అమలుచేస్తామని చెప్పారుగా? మేము రూ.500లకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇస్తే మీరు రూ.400కే ఇస్తామన్నారుగా?మరి వాటిని మీరెలా అమలుచేయాలనుకొన్నారు?” అని సీతక్క ప్రశ్నించారు.
గత పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో చాలా సమస్యలను దుప్పటి కింద దాచిపెట్టేసి, అంతా అద్భుతంగా సాగిపోతోందని కేసీఆర్, కేటీఆర్ చెప్పుకొనేవారని సీతక్క ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రతీ సమస్యని గుర్తించి పరిష్కరిస్తుందని, రాబోయే రోజులలో ప్రజలు, బిఆర్ఎస్ నేతలే ఇది చూస్తారని సీతక్క అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను కూడా వెలికి తీసి ప్రజల ముందు పెడతామని సీతక్క చెప్పారు. ప్రభుత్వం మారగానే కార్యాలయాలలో ఫైల్స్ కాల్చేయడం, దొంగతనం చేయడం, మాజీ మంత్రులు కార్యాలయాలలో ఫర్నీచర్ ఎత్తుకుపోవడం వంటివి చూసి ఆశ్చర్యపోయానని, వాటిపై కూడా దర్యాప్తు జరిపిస్తామని మంత్రి సీతక్క చెప్పారు.