ధరణిలో 2.30 లక్షల దరఖాస్తులు పెండింగులో...

సిఎం రేవంత్‌ రెడ్డి బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ధరణి పోర్టల్‌ నిర్వహణ గురించి అధికారులను ప్రశ్నించారు. ధరణిని ఏ సంస్థ రూపొందించింది?ధరణి నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు ఎందుకు అప్పగించారు?దానిని నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థలకు చట్ట బద్దత ఉందా లేదా?వాటికి రైతుల రికార్డుల గోప్యత, భద్రత కల్పించే సామర్ధ్యం,టెక్నాలజీ ఉన్నాయా లేవా?కంప్యూటర్లలో భద్రపరిచిన ఆ రికార్డులు ఒకవేళ ఏ కారణంగానైనా చెరిగిపోతే, కరప్ట్ అయిపోతే,  అప్పుడు భూ యజమానుల రికార్డులు ఏవిదంగా తీస్తారు?మాన్యువల్ రికార్డ్స్ నిర్వహిస్తున్నారా లేదా? 

ధరణికి రైతు బంధుకి సంబంధం ఏమిటి? ధరణిలో పెండింగులో ఉన్న దరఖాస్తులెన్ని? ధరణి పోర్టల్‌ ద్వారా ఎంత మంది భూపట్టాలు రిజిస్ట్రేషన్స్ చేసి ఎంతమందికి పాస్ పుస్తకాలు ఇచ్చారు? ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకొన్న రైతులు, ఒకవేళ స్లాట్ రద్దు చేసుకొంటే, వారి దరఖాస్తు ఫీజు ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు?అంటూ సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు అధికారులని అనేక ప్రశ్నలు అడిగారు. 

పది రోజుల తర్వాత మళ్ళీ సమావేశం అవుదామని, అప్పుడు ధరణికి సంబందించి పూర్తి నివేదికతో రావాలని సిఎం రేవంత్‌ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అసైన్డ్, భూదాన్, సాదా బైనామా తదితర భూసమస్యలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేద్దామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఈలోగా రెవెన్యూ సదసులు నిర్వహిస్తూ రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తుండాలని ఆదేశించారు.   

అధికారులు ఏమన్నారంటే... 

ధరణి పోర్టల్‌కి రైతుబంధుకి ఎటువంటి సంబంధమూ లేదు. (నివేదిక సమర్పించేటప్పుడు ఇదే విషయం సంబందిత ఫైల్లో వ్రాసి అధికారులను సంతకం చేసి ఇవ్వాలని సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.)

ధరణి పోర్టల్‌లో భూసమస్యలను పరిష్కరించాలంటూ 2.30 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. 

ఇంకా 1.80 లక్షల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది.