ఈరోజు ఉదయం లోక్‌సభ సమావేశం జరుగుతుండగా గ్యాలరీలో నుంచి
ఒక వ్యక్తి ఎంపీలు కూర్చొనే కుర్చీలపైకి దూకి అటు నుంచి ఇటు,
ఇటు నుంచి అటూ బల్లలపై దూకుతూ హంగామా సృష్టించాడు. గ్యాలరీలో మరో వ్యక్తి తన
వెంట తెచ్చుకొన్న పసుపు రంగులో ఉండే పొగని స్ప్రే చేశాడు. ఊహించని ఈ పరిణామంతో లోక్‌సభలో
అందరూ షాక్ అయ్యారు. అయితే కొందరు ఎంపీలు వెంటనే తేరుకొని బల్లలపై దూకుతూ నినాదాలు
చేస్తున్న ఆ యువకుడిని బందించి, భద్రతా సిబ్బందికి అప్పగించారు. గ్యాలరీలో మరో యువకుడిని
కూడా భద్రత సిబ్బంది అదుపులో తీసుకొన్నారు.
పార్లమెంట్ బయట కూడా ఒక యువతి, యువకుడు
పసుపు, ఎరుపు రంగు పొగ స్ప్రే చేస్తూ నినాదాలు చేస్తుంటే భద్రతా
సిబ్బంది వారిని కూడా అదుపులోకి తీసుకొన్నారు. జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము
సభలో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
సరిగ్గా 22 ఏళ్ల క్రితం అంటే 2001లో ఇదే రోజు,
ఇదే సమయంలో జైష్ మహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంట్‌పై
దాడి చేశారు. ఆ దాడిలో చనిపోయిన వారికి పార్లమెంట్ సభ్యులు శ్రద్దాంజలి గతించిన తర్వాత
ఈ ఘటన జరిగింది.
కొత్త పార్లమెంట్ భవనం మునుపటి దానికంటే అత్యాధునిక, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా కలిగి ఉంది. కనుక అనుమతి లేకుండా ఎవరూ ఆవరణలోకి కూడా ప్రవేశించలేరు. కానీ ఇద్దృ యువకులు లోనికి ప్రవేశించడమే కాకుండా తనికీలను తప్పించుకొని స్ప్రే బాటిల్స్ తీసుకొని లోక్‌సభలోనికే ప్రవేశించారు. వారికి బదులు ఉగ్రవాదులు లోనికి జొరబడి ఉంటే?మరోసారి దాడి జరిగి ఉండేది కదా? కనుక ఇది తీవ్ర భద్రతాలోపమే అని చెప్పక తప్పదు.