ఆర్మూర్ ఛైర్మన్‌ వినితకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం!

ఆర్మూర్‌ పురపాలక సంఘం ఛైర్ పర్సన్‌ పండిత్ వినీతకు వ్యతిరేకంగా ఆమె సొంత పార్టీ బిఆర్ఎస్‌కే చెందిన 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. వారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని సంప్రదించి, ఆయనపై ఒత్తిడి తెచ్చి ఇందుకు ఒప్పించారు. నోటీస్ ఇచ్చినవారిలో ఆయన సోదరుడు కూడా ఉండటమే ఇందుకు నిదర్శనం.

పండిత్ వినీత తమకు తెలియజేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని, పట్టణంలో అభివృద్ధి పనులకు తమకు సహకరించడం లేదని వారి ప్రధాన ఆరోపణ.  నిన్న వారందరూ కలిసి కమీషనర్ రాజీవ్ హన్మంతుకు నోటీస్ అందజేశారు. 

ఆర్మూర్ మునిసిపల్ కౌన్సిల్లో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా, ఐదుగురు స్వతంత్ర అభ్యర్ధులు, కాంగ్రెస్‌, బీజేపీల నుంచి చెరో కౌన్సిలర్ కలిపి బిఆర్ఎస్ పార్టీకి 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో 24 మంది అవిశ్వాసతీర్మానం నోటీస్ ఇచ్చారు. దీనిపై 15 రోజులలోగా అంటే డిసెంబర్‌ నెలాఖరులోగా మున్సిపల్ కమీషనర్ నిర్ణయం తీసుకొని సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

దీనిపై ఆర్మూర్ ఛైర్ పర్సన్‌ పండిత్ వినిత స్పందిస్తూ, “మా పార్టీ కౌన్సిలర్లు కొందరు నాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన్నట్లు తెలిసింది. నేను ఛైర్ పర్సన్‌ అయినప్పటి నుంచి పట్టణం అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నాను. అయినా ఎందుకు నన్ను దింపేయాలనుకొంటున్నారో తెలీదు. త్వరలో నేను జీవన్ రెడ్డిగారిని కలిసి ఈ విషయం గురించి మాట్లాడుతాను,” అని అన్నారు.