కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలలో మహాలక్ష్మి పధకం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో ఇప్పుడు రాష్ట్రంలో మహిళలు రూ.500లకే గ్యాస్ సిలెండర్ పధకం హామీ అమలు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న తన శాఖ అధికారులతో శాఖ పరిస్థితిపై సమీక్షా సమావేశం జరిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “పౌరసరఫరాల శాఖ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. గత ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందకపోవడంతో రూ.56,000 కోట్లు అప్పులు చేసింది. పౌరసరఫరాల శాఖకు సుమారు రూ.11,000 కోట్ల వరకు నష్టపోయింది కూడా. గత ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడంతో దాదాపు అన్ని శాఖల ఆర్ధిక పరిస్థితి ఇదే విదంగా ఉంది.
అయినప్పటికీ మా ప్రభుత్వం ఎన్నికల హామీలన్నిటికీ కట్టుబడి ఉంది. ఇప్పటికే రెండు హామీలు అమలుచేశాము. మిగిలిన వాటిలో రూ.500లకే గ్యాస్ సిలెండర్ పధకంతో అన్నిటినీ మూడు నెలల్లోగా అమలుచేస్తాం. పౌరసరఫరాల శాఖ కిలో బియ్యం రూ.39 చొప్పున కొనుగోలు చేసి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఉచితంగా అందిస్తోంది. కానీ చాలామంది లబ్ధిదారులు ఆ బియాన్ని వినియోగించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఈ లెక్కన ఉచిత బియ్యం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
రేషన్ షాపుల నుంచి బియ్యం తీసుకొంటున్నవారిలో ఎంతమంది దానిని వండుకొని తింటున్నారనే దానిపై ఓ సర్వే చేయాలసిన అవసరం కనిపిస్తోంది. కనుక ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యం అందించగలిగితే, ఈ వృధాని అరికట్టవచ్చని భావిస్తున్నాము. అర్హులకు తప్పకుండా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. కానీ లక్షలాదిమంది తెల్ల రేషన్ కార్డులు తీసుకొన్నారు కానీ వినియోగించుకోవడం లేదు. కనుక దీనిపై కూడా సర్వే నిర్వహించాల్సి ఉంది,” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.