టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేసి అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ గవర్నర్ తమిళిసైకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కానీ టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్నందున, న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదించలేదు.
ఇక టిఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ఓసారి సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. మళ్ళీ నేడు మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జనార్ధన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు కనుక ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం బోర్డు సభ్యులందరి చేత రాజీనామాలు చేయించి, టిఎస్‌పీఎస్సీకి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన అన్ని పరీక్షలను నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేయవచ్చునని తెలుస్తోంది.