మా అబ్బాయికి మంత్రి పదవి... ఇంకా చాలా టైమ్ ఉంది: జానారెడ్డి

సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సోమవారం ఉదయం సీనియర్ కాంగ్రెస్‌ నేత కె జానారెడ్డి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు, సహాయసహకారాలు ఇవ్వాలని వారు కోరారు. జానారెడ్డి కూడా వారిని సాదరంగా ఆహ్వానించి శాలువాలు కప్పి సత్కరించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావాలనేది తన కార్యకర్తలు అని దానిని సాకారం చేసినందుకు వారికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగించాలని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలుచేసి ప్రజాధరణ పొందాలని వారికి సూచించారు.

మంత్రులందరూ భేషజాలు పక్కన పెట్టి కలిసి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని జానారెడ్డి హితవు పలికారు. ఓ కాంగ్రెస్‌వాదిగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎప్పుడు అవసరమైనా తన వంతు తోడ్పాటు అందించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. సుమారు గంటసేపు వారు కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిస్థితి, రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. 

అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “మా అబ్బాయి జైవీర్ ఇప్పుడు శాసనసభలో అడుగుపెడుతున్నాడు. రాజకీయాలలో ఇంకా చాలా జూనియర్. కనుక తనకి మంత్రి పదవి ఇవ్వాలని అడగలేదు. అడగడం సమంజసం కాదు కూడా. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తాను,” అని చెప్పారు.