సిఎం క్యాంప్ కార్యాలయం త్వరలో మార్పు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన క్యాంప్ కార్యాలయాన్ని ప్రజాభవన్‌ నుంచి జూబ్లీహిల్స్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి)కి మారబోతున్నారు.

రేవంత్‌ రెడ్డి, మంత్రులు, అధికారులు కలిసి ఆదివారం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న మానవ వనరుల శిక్షణ గురించి ఆ సంస్థ అధికారులు వారికి వివరించారు. దానిని ప్రజాభవన్‌లోకి మార్చి, సిఎం క్యాంప్ కార్యాలయాన్ని సువిశాలమైన ఆ భవన సముదాయంలోకి మార్చేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

మాజీ సిఎం కేసీఆర్‌ ప్రజాభవన్‌లోనే నివాసం ఉన్నప్పటికీ రేవంత్‌ రెడ్డి దానిలో ఉండాలనుకోవడం లేదు. జూబ్లీహిల్స్‌లోని తన సొంత భవనంలోనే ఉంటూ, క్యాంప్ కార్యాలయాన్ని పూర్తిగా అధికారిక కార్యక్రమాలకే వినియోగించాలని భావిస్తున్నారు.

కనుక తన నివాసానికి సమీపంలో 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిని తన క్యాంప్ కార్యాలయంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. దానిలో 150 మంది కూర్చోనేందుకు వీలుగా 4 సమావేశ మందిరాలు, 250 మంది కూర్చోనేందుకు వీలుగా ఒక ఆడిటోరియం ఉన్నాయి. ఇవి కాక అతిధుల కోసం కృష్ణ, గోదావరి, మంజరి, తుంగభద్ర బ్లాకులు కూడా ఉన్నాయి. 

కనుక ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిని సిఎం క్యాంప్ కార్యాలయంగా మార్చుకొన్నట్లయితే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్న్తాధికారులు, ప్రతిపక్ష నేతలకు, ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని సిఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. త్వరలో దీనిపై అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత ప్రకటన వెలువడే అవకాశం ఉంది.