గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిద కార్పొరేషన్లకు చైర్మన్లు, చైర్ పర్సన్స్, వైస్ చైర్మన్లుగా వ్యవహరించిన వారిలో పలువురు ఇప్పటికే రాజీనామాలు చేయగా, ఇంకా చేయనివారిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. దాదాపు 25కి పైగా కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్స్, వైస్ చైర్మన్లు పదవులలో నుంచి తొలగిస్తూ సిఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంతకాలం వారి వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా తొలగించింది. కార్పొరేషన్ చైర్మన్ల వద్ద పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులను, సిబ్బందిని ఆయా శాఖలకు బదిలీ చేసింది. ఇప్పటికే వివిద శాఖల సలహాదారులు, స్పెషల్ ఆఫీసర్లను తొలగించిన సంగతి తెలిసిందే.
పదవీ విరమణ చేసినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పొడిగింపు పొంది ఇంకా పదవులలో కొనసాగుతున్న అధికారుల జాబితాను కూడా సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో వారినీ బయటకు సాగనంపబోతోంది. ఈ ప్రక్షాళన కార్యక్రమం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ నేతలకు లేదా వారికి సంబందించిన వారికి ఈ పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది.
తొలగింపబడినవారిలో కొందరు ప్రముఖులు:
ప్రొఫెసర్ లింబాద్రి: ఉన్నత విద్యామండలి ఛైర్మన్
అల్లం నారాయణ: మీడియా అకాడమీ
తాటికొండ రాజయ్య: రైతుబంధు సమితి ఛైర్మన్
ఎర్రోళ్ళ శ్రీనివాస్: వైద్యమౌలిక సదుపాయాల అభివృద్ధి
సముద్రాల వేణుగోపాలాచారి: టిఎస్‌ఐడిసీ
పిట్టల రవీందర్: మత్స్యకార సలహాసంఘాల సమాఖ్య
కంచర్ల రామకృష్ణారెడ్డి: నూనె గింజల కార్పొరేషన్.