యశోదా ఆస్పత్రిలో చేరిన మాజీ సిఎం కేసీఆర్‌

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు గురువారం అర్దరాత్రి సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ప్రజాభవన్‌ ఖాళీ చేసి ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కి తరలిపోయి అక్కడే ఉంటున్నారు.

నిన్న రాత్రి బాత్రూములో కాలుజారిపడటంతో తుంటి ఎముక విరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే యశోదా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు నొప్పి నివారణకు అవసరమైన ప్రాదమిక చికిత్స  చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి రిపోర్టులు వచ్చిన తర్వాత అవసరమైతే తుంటి ఎముక శస్త్ర చికిత్స చేస్తారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.  

ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. బిఆర్ఎస్ నేతలందరూ అక్కడికే వచ్చి ఆయనను కలుస్తున్నారు. కొత్తగా ఎన్నికైన అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు (శుక్రవారం) శాసనసభలో జరుగబోతోంది. శస్త్ర చికిత్స జరిగితే కేసీఆర్‌ రేపు ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోవచ్చు.