
ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు 11 మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఊహించిన్నట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సుదర్శన్ రెడ్డిలకు మంత్రి పదవులు లభించాయి.వారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖలకు కూడా మంత్రి పదవులు లభించాయి. మొత్తం 11 మంది నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వారందరికీ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్లు చేసి ఈవిషయం తెలియజేసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు.
జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి, ఉమ్మడి నల్గొండ నుంచి ఇద్దరికి, ఉమ్మడి కరీంనగర్ నుంచి ఇద్దరికి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరికి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఒకరికి, మెదక్ జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవులు లభించాయి.
ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి, లక్డీకాపూల్, అబీడ్స్ తదితర ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను వేరే మార్గాలలోకి మళ్ళిస్తున్నారు.