
రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలందరినీ కలిసి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. మంత్రివర్గం కూర్పుపై కూడా చర్చించారు. తర్వాత పెద్దలందరినీ తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావలసిందిగా పేరుపేరునా ఆహ్వానించారు. పార్లమెంట్ వద్ద తెలుగు రాష్ట్రాల ఎంపీలు స్వీట్లు తినిపించి ఆయనను అభినందించారు.
ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీగా తిరుగుతుంటే, ఇక్కడ హైదరాబాద్‌లో పోలీస్, ప్రభుత్వాధికారులు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకి ప్రభుత్వం తరపున ఆహ్వానాలు వెళ్ళాయి.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో అందరినీ కలిసిన తర్వాత హైదరాబాద్ బయలుదేరేందుకు విమానాశ్రయం చేరుకొన్నప్పుడు, కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే మహారాష్ట్ర భవన్ వద్దకు రావాలని చెప్పడంతో ఆయన వెనుతిరిగి అక్కడకు వెళ్ళారు. హైదరాబాద్ బయలుదేరే ముందు మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిందో, ఎందుకు వెనక్కు పిలిపించిందో ఇంకా తెలియవలసి ఉంది.