కేసీఆర్‌, చంద్రబాబు, జగన్‌లకు రేవంత్‌ ఆహ్వానాలు

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకా వాద్రలతో పాటు కాంగ్రెస్‌ పాలిత, కాంగ్రెస్‌ మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌, ఏపీ సిఎం జగన్, తమిళనాడు సిఎం స్టాలిన్, కర్ణాటక సిఎం, డెప్యూటీ సిఎం సిద్దరామయ్య, డికె శివకుమార్ తదితరులకు ఆహ్వానాలు వెళ్ళాయి. 

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాకూర్‌, ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బగేల్, వాయలార్ రవి, మీరా కుమార్, కుంతియా, సుశీల్ కుమార్‌ షిండే, వీరప్ప మొయిలీ తదితరులను కూడా ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్‌ ఆహ్వానించింది. 

ఎన్నికలలో కాంగ్రెస్‌కు సహకరించిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌, మేధావులు కంచె ఇలయ్య, గాదె ఇన్నయ్య, హరగోపాల్ తదితరులకు కూడా ఆహ్వానించారు. తెలుగు సినీ ప్రముఖులందరికీ కూడా ఆహ్వానించారు. ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం విశేషమనే చెప్పాలి.