పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనకు భద్రత కల్పించాలంటూ కోర్టులని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన రోజులున్నాయి.ఒకప్పుడు ఆయనను గృహనిర్బందం చేసి ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకొనేందుకు పోలీసులు కాపలాకాసేవారు. నేడు ఆయనకు రక్షణ కల్పించడానికి కాపలా కాస్తున్నారు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన ఇంటికి కట్టుదిట్టమైన భద్రత లభించింది. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతుండటమే కారణమని వేరే చెప్పక్కరలేదు.
ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించబోతోందని తెలిసినప్పుడే తెలంగాణ డిజిపి అంజని కుమార్ తదితర ఉన్నత పోలీస్ అధికారులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేసి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆవిదంగా చేసి ఎన్నికల కోడ్ ఉల్లంగించినందుకు ఈసీ వారిని సస్పెండ్ చేసింది. అది వేరే విషయం.
రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్: 44లో నివాసం ఉంటున్నారు. సమీపంలోనే ఓ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకొన్నారు. అక్కడే ప్రజా దర్భార్ నిర్వహించబోతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ కూడా భద్రత కల్పించారు.
రేవంత్ రెడ్డి నివాసం వద్ద రెండు ప్లటూన్ల పోలీస్ బలగాలతో రేయింబవళ్లు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటైంది. బుధవారం నుంచి సాయుధ దళాలు, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, నిఘా, ట్రాఫిక్ తదితర విభాగాలకు చెందిన పోలీస్ సిబ్బంది కూడా రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ప్రజాభవన్‌గా పేరు మార్చిన ప్రగతి భవన్‌లోకి రేవంత్ రెడ్డి మారే వరకు జూబ్లీహిల్స్ లో నివసించే ప్రజలకు పోలీసులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు.