19.jpg)
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో, కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకొని సీనియర్లతో మాట్లాడి సమస్యలను చక్కబెట్టేందుకు ప్రయత్నించారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానం చేతికి వెళ్ళడంతో అక్కడా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో సుదీర్గంగా చర్చించి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఒప్పించిన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో వారి సమావేశం ముగిసిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మా అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించినా నాకు అభ్యంతరం లేదు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను,” అని చెప్పారు. అంటే ఆయన ఈ రేసులో నుంచి తప్పుకొన్నట్లు అర్దమవుతోంది.
కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డివైపే మొగ్గుచూపుతున్నట్లు డికె శివకుమార్ తన అనుచరులతో చెప్పిన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి బయట నుంచి వచ్చిన వ్యక్తి అంటూ సీనియర్ల అభ్యంతరాల ప్రస్తావన వచ్చినప్పుడు, “కర్ణాటక కాంగ్రెస్‌లోకి సిద్దరామయ్య కూడా బయట నుంచే వచ్చారు. మన అధిష్టానం కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న నన్ను కాదని ఆయనను ముఖ్యమంత్రిగా నియమించింది కదా?కనుక రేవంత్ రెడ్డిని నియమిస్తే తప్పేమిటి?” అని అన్నట్లు సమాచారం.
కనుక ఆయన కూడా రేవంత్ రెడ్డివైపే మొగ్గు చూపుతున్నట్లు అర్దమవుతోంది. మరికొద్ది సేపటిలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పేరుని ప్రకటించే అవకాశం ఉంది.