ఎన్నికల కోడ్ రద్దు చేసిన ఈసీ

తెలంగాణతో సహా ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్‌ నాలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లిఖితపూర్వకంగా సోమవారం సాయంత్రం తెలియజేసింది.

ఇకపై ఎన్నికల నియమావళి వర్తించదు కనుక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించిన అధికారులను మళ్ళీ వెనక్కు తీసుకోవచ్చని తెలియజేసింది. ఎన్నికల కోడ్ ఎత్తివేసినందున నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు యధావిధిగా అధికార, అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పధకాలను చేపట్టవచ్చు.

ఎన్నికల సమయంలో కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం తీసుకొన్న నిర్ణయాలను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పునః సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు ఫలితాలు వెలువడుతుండగానే తెలంగాణ డిజిపి అంజని కుమార్‌ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేయడాన్ని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంగా భావించిన ఈసీ ఆయనను ఆ పదవిలో నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకొంటే ఆ నిర్ణయాన్ని సమీక్షించుకొని మళ్ళీ ఆయనను డిజిపిగా నియమించుకోవచ్చు.