ఎన్నికలలో ఓడిపోవడంతో కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ తన అధికార నివాసం ప్రగతి భవన్ ఖాళీ చేశారు. కేసీఆర్ దంపతులు ఆదివారం రాత్రి ఎర్రవెల్లిలోని తమ ఫామ్ హౌస్ చేరుకొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ప్రగతి భవన్‌నూఖాళీ చేసి దానిలోని తమ సామానుని ఖాళీ చేస్తున్నారు. ఆయన బంజారాహిల్స్, నంది రోడ్‌లోని తన నివాసానికి మకాం మారుస్తున్నారు. ప్రస్తుతం ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ కుటుంబానికి చెందిన సామాను తరలింపు జరుగుతోందని సంబంధిత అధికారులు తెలిపారు.
కేసీఆర్ లోక్‌సభ సభ్యుడుగా ఉన్నప్పుడు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వం ఆయనకు అధికార నివాసాన్ని కేటాయించింది. ముఖ్యమంత్రి హోదాలో ఇంతకాలం దానిని వాడుకొంటున్నారు. ఇప్పుడు దానిని కూడా ఖాళీ చేస్తున్నారు.
కేసీఆర్ సోమవారం ఉదయమే ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ చేరుకోగా, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు అందరూ అక్కడకు చేరుకొన్నారు. వారితో ఆయన సమావేశమైనప్పుడు, “గెలుపోటములు సహజం. కనుక ఈ ఓటమితో ఎవరూ క్రుంగిపోనవసరం లేదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిద్దాం. అది తన హామీలను అమలుచేసేందుకు కొంత సమయం ఇద్దాము. ఒకవేళ అమలుచేయకపోతే అప్పుడు మన పోరాటాలు మొదలుపెడదాము,” అని కేసీఆర్ అన్నారు.