తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలుచుకోగా, బిఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లీస్ 7, ఇతరులు 1 సీట్లు గెలుచుకొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో సిఎం కేసీఆర్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దానిని ఆమోదించి, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.
ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడగానే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాకూర్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్, ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు గవర్నర్‌ని కలిసి తమ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దంగా ఉందని తెలియజేశారు. అందుకు ఆమె సమ్మతించారు.
ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించుకోవాలని ముందు అనుకొన్నప్పటికీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోయే ప్రమాదం పొంచి ఉన్నందున, ఈరోజు ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం నిర్వహించి సీఎల్పీ నాయకుడుని ఎన్నుకొంటారు.
తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఆ పదవి అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక మాణిక్‌రావ్ ఠాకూర్, డికె శివకుమార్ సమక్షంలో ఈరోజు ఉదయం జరుగబోయే సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని తమ సీఎల్పీ నాయకుడుగా ఎన్నుకొంటారు. వెంటనే అందరూ కలిసి రాజ్‌భవన్‌కు వెళతారు. అక్కడే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.