
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుండటం సిఎం కేసీఆర్కు పెద్ద షాక్ అనుకొంటే, ఆయన పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గంలో కూడా వెనకబడిపోవడం ఇంకా పెద్ద షాక్ అనే చెప్పాలి.
అక్కడ మొదటి నుంచి ఆధిక్యతలో సాగుతున్న బీజేపీ అభ్యర్ధి వెంకటరమణ గంట క్రితం 1,007 ఓట్లు ఆధిక్యతలో మొదటి స్థానంలో ఉండగా, 11వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3,335 ఓట్ల ఆధిక్యతతో మొదటి స్థానానికి దూసుకు వచ్చారు. దీంతో సిఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు.
గజ్వేల్లో మాత్రం కేసీఆర్ 11,714 ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. 8వ రౌండ్ ముగిసేసరికి కేసీఆర్ 5,006 ఓట్ల ఆధిక్యతతో మొదటి స్థానంలో, అక్కడ నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఆయనపై పోటీ చేసిన ఈటల రాజేందర్ 3,118 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఒంటి చేత్తో ఓడించిన ఈటల రాజేందర్ ఈసారి బిఆర్ఎస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోనున్నారు. కౌశిక్ రెడ్డి సుమారు 10 వేలకు పైగా ఆధిక్యతలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ అభ్యర్ధి ప్రణవ్ రెండో స్థానంలో ఈటల రాజేందర్ మూడో స్థానంలో ఉన్నారు.