రేవంత్‌ రెడ్డికి డిజిపి అభినందనలు... భద్రత పెంపు!

తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయభేరి మోగించబోతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు 19 సీట్లు గెలుచుకొని మరో 46 స్థానాలలో ఆధిక్యతలో దూసుకుపోతోంది. ప్రభుత్వం ఏర్పాటుకి 60 సీట్లు కావలసి ఉండగా 65-67 సీట్లు సాధించే దిశలో కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. 

పిసిసి అధ్యక్షుడు కొడంగల్లో రేవంత్‌ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ డిజిపి అంజనీ కుమార్‌, రాచకొండ సిపి మహేష్ భగవత్, తెలంగాణ సిఐడీ చీఫ్ సంజయ్ కుమార్‌ జైన్ తదితర ఉన్నతాధికారులు రేవంత్‌ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నందున భద్రత కూడా పెంచారు. 

కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు అప్పుడే టపాసులు పేల్చి సంబురాలు చేసుకొంటున్నాయి. కాంగ్రెస్‌ ముఖ్య నేతల ఇళ్ళవద్ద కార్యకర్తల హడావుడితో పండగ వాతావరణం నెలకొని ఉంది. 

ఇక బిఆర్ఎస్ ఓటమి ఖరారు అవడంతో తెలంగాణ భవన్‌ వెలవెలపోతోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి,కొప్పుల ఈశ్వర్ ఓడిపోగా ఇంకా మరికొందరు మంత్రులు ఓటమి అంచున ఉన్నారు.